– రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ మణుగూరు: పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు ఆ పార్టీ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇంటి స్థలాలు ఇండ్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం పేదలందరికీ ఇంటిస్థలాలు ఇవ్వడం మరిచిందని విమర్శించారు. పేదలందరికీ ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో గుర్తించిన ప్రభుత్వ స్థలాలను కాపాడాలని వాటిని నిరుపేదలకు కేటాయించాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం పేదలందరికీ 18 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని కోరారు.

పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దశలవారి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పోరాటం ఉధృతం కాకముందే ప్రభుత్వ స్థలాలను ప్రజలకు పంచే కార్యక్రమం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శివర్గ సభ్యులు పిట్టల నాగమణి, మాచారపు లక్ష్మణరావు, పల్లె చంద్రయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.