నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తిని, ఆయన కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఒక దుండగుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి తల నరికి చంపేశాడు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఈ నెల 10న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక చిన్న గొడవ కారణంగా ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మృతుడిని 50 ఏళ్ల చంద్రమౌళి నాగమల్లయ్యగా గుర్తించారు. డల్లాస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్‌లో ఈ దారుణం జరిగింది. యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తిని ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన మహిళా సహోద్యోగితో కలిసి మోటెల్‌లోని ఒక గదిని శుభ్రం చేస్తుండగా, చంద్రమౌళి అక్కడికి వెళ్లారు. అప్పటికే పాడైపోయిన వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించవద్దని వారికి సూచించారు.
అయితే, చంద్రమౌళి ఈ విషయాన్ని నేరుగా కోబోస్‌తో చెప్పకుండా, అతని పక్కనే ఉన్న మహిళా సహోద్యోగికి చెప్పడంతో కోబోస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను కాదని ఆమెతో మాట్లాడటాన్ని అవమానంగా భావించాడు. వెంటనే తన వద్ద దాచుకున్న కత్తిని బయటకు తీసి చంద్రమౌళిపై దాడికి తెగబడ్డాడు. ప్రాణభయంతో చంద్రమౌళి మోటెల్ పార్కింగ్ స్థలంలోకి పరుగులు తీశారు. అయినా వదలకుండా నిందితుడు అతన్ని వెంటాడి, కిరాతకంగా దాడి చేశాడు.
అరుపులు విని బయటకు వచ్చిన చంద్రమౌళి భార్య, కొడుకు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ నిందితుడు వారిని పక్కకు తోసేసి, చంద్రమౌళి తల నరికేశాడు. అనంతరం తెగిపడిన తలను రెండుసార్లు కాలితో తన్ని, చెత్తకుండీలో పడేసేందుకు ప్రయత్నించాడు. సమీపంలోనే ఉన్న అగ్నిమాపక సిబ్బంది, రక్తం మరకలతో ఉన్న నిందితుడిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కోబోస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తానే కత్తితో చంద్రమౌళిని చంపినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.