– 2500 గజాల ప్రభుత్వ భూమి స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. చంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ మండలం కందికల్ గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను బుధవారం హైడ్రా తొలగించింది. 303, 306 సర్వే నెంబర్లలో 2500 గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి ఈ స్థలం యూఎల్‌సీ ల్యాండ్ కాగా.. సయ్యద్ బషీరుద్దీన్, సయ్యద్ అమీదుల్లా హుస్సేన్ కబ్జా చేశారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని తమ పేరు మీద రెగ్యులరైజ్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా.. అందులో అనుమతులు లేకుండా షెడ్డులు, రూంలు నిర్మించారు. దాంతో ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతోందని.. కాపాడాలని స్థానికుల నుంచి ప్రజావాణికి ఫిర్యాదు అందడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. హైకోర్టు కూడా ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని 2 నెలల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అక్కడ నిర్మించిన 4 ఆర్‌సీసీ రూములు, రేకుల షెడ్డులు, 4షాపులు కూల్చివేసి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్థానిక రాజకీయ నాయకులు, కబ్జాదారులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసుల సహకారంతో వారిని అరెస్టు చేసి కూల్చివేతలను కొనసాగించారు.
అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES