నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డు దిగ్బంధించి భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమయ్యారని కేంద్ర మాజీ మంత్రికి యూపీ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో 13 మందికి కూడా శిక్ష విధించింది. దాదాపు 12 ఏండ్ల నాటి కేసులో వీరందరికి ఇప్పుడు శిక్ష ఖరారు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లో కరెంటు కోతలకు వ్యతిరేకంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రదీప్ జైన్ ఆధిత్య పిలుపుమేరకు 2013 జూన్ 11న ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిని కార్యకర్తలు దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనతోపాటు మరో 13 మందిపై కేసు నమోదుచేశారు.
విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు అనిల్ కుమార్‌తోపాటు మిగిలిన 13 మందిని దోషులుగా తేల్చింది. వారికి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే వారిని వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదల చేసింది. తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి నెల రోజులు గడువు ఇచ్చింది.