Saturday, May 17, 2025
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ సిందూర్‌కు సంపూర్ణ మద్దతు

ఆపరేషన్‌ సిందూర్‌కు సంపూర్ణ మద్దతు

- Advertisement -

– ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎంను కలుస్తాం
– ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలి
– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది బీఆర్‌ఎస్సే
– ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు మేధావుల కమిటీ వేయాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం లేదనీ, గతంలో పాకిస్తాన్‌లోనూ, భారత్‌లోనూ ప్రధానమంత్రులను చంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఆక్రమిత కాశ్మీర్‌ను అడ్డాగా చేసుకుని పాకిస్థాన్‌ పాలకులు, ఉగ్రవాదులు భారత్‌లో నరమేధాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనానికి మారుపేరైన భారతదేశానికి ఉగ్రవాదం నుంచి శాశ్వతంగా విముక్తి జరగాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలని కేంద్రాన్ని కోరారు. మావోయిస్టులు చర్చలకు వస్తామంటే దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదనీ, లొంగిపోవాల్సిందేనని ఒక కేంద్ర మంత్రి నియంతలా మాట్లాడటం సరిగాదని అన్నారు. దేశ పౌరులైన వారికి దేశంలోని అన్ని చట్టాలు వర్తిస్తాయని చెప్పారు. కూంబింగ్‌ పేరుతో కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టులను చంపడాన్ని తప్పుబట్టారు. సమ్మె ఉద్యోగుల హక్కు అనీ, వారితో చర్చించేందుకు పాలకులు ఎప్పుడూ సానుకూలంగా ఉండాలని సూచించారు. ఆవేశానికి, ఆక్రోశానికి గురైతే సమస్య మరింత జఠిలమవుతుందని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరపాలనీ, దాంతోనే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్రంలో వివిధ వర్గాల వారికి దాదాపు రూ.70 వేల కోట్ల బకాయిలున్నాయనే విషయాన్ని అర్ధమయ్యేలా ఉద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించాలని సూచించారు. ఒకసారి వీలుకాకపోతే విడతల వారీగా చెల్లించి న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని ప్రకటించారు. మంత్రి పొన్నంతో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిన నేపథ్యంలోనే కార్మికులు సమ్మె వాయిదా వేశారన్నారు. గత సీఎం కేసీఆర్‌ ఓ నియంతలా వ్యవహరిస్తూ యూనియన్లను రద్దు చేయడమే కాకుండా కార్మిక హక్కులను కాలరాశారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని విమర్శించారు. ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విధంగా సీఎం ఆలోచించాలని సూచించారు. లేకపోతే ప్రభుత్వం అప్రతిష్ట పాలయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఆర్థికవేత్తలు, మేధావులతో ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో అరకొర సహాయం పొందిన వారికి ప్రస్తుత జాబితాలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలనీ, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీలో చేరితే తక్షణమే వారి సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలందర్నీ మింగేసి తమ పార్టీలో కలుపుకుని ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -