నవతెలంగాణ-హైదరాబాద్: దుబాయ్ వేదికగా జరగనున్న ఆసియాకప్ టోర్నిలో పాక్-ఇండియా మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సీరిస్ కాకుండా అంతర్జాతీయ టోర్నమెంట్లో పాకిస్థాన్ తో ఆడేందుకు ఇండియా టీంకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకముందు పహల్గాం దాడితో ఆగ్రహించిన భారత్ ప్రభుత్వం ఇరుదేశాల మధ్య ఎలాంటి క్రీడాపోటీలు జరగడానికి వీలులేదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అంతర్జాతీయ వేదికగా జరిగే టోర్నిలో పాక్ తో ఆడేందకు ఇండియా టీంకు కేంద్రం ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. తాజాగా ఆసియా కప్ టోర్నిలో పాక్-ఇండియా మ్యాచ్‌పై శివసేన(UBT) చీప్ ఉద్దవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం దేశభక్తిని రాజకీయం, వ్యాపారాలతో ముడిపెడుతోందని ఆయన ఆరోపించారు. రక్తం, నీరు కలిసి ప్రవాహాం చేయవని పీఎం మోడీ చెప్పారని, మరీ క్రికెట్, రక్తం ఏవిధంగా కలిసిపోతుందని ఉద్దవ్ ప్రశ్నించారు. వాళ్లు దేశభక్తిని వ్యాపారాలతో పోల్చుతున్నారని మండిపడ్డారు. ఆ మ్యాచ్ నుండి వచ్చే డబ్బు అంతా వారికి కావాలి కాబట్టి వారు రేపు మ్యాచ్ ఆడబోతున్నారని ఆరోపించారు. శివసేన (UBT) మహిళా శ్రేణులు నిరసన తెలుపుతారని, మహారాష్ట్రలో వీధుల్లోకి వచ్చి ప్రతి ఇంటి నుండి ప్రధాని మోడీకి సిందూరం పంపబోతున్నారని వెల్లడించారు.