– అనుమతులు లేకుండానే ఐల్యాండ్ నిర్మాణం
– 70-100 ఎకరాల చెరువు కబ్జా
– పూడికతీత పనులను పెండింగ్‌లో పెట్టిన ‘కుడా’
– జూన్ 15లోపు పూర్తయ్యేనా..?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) నిర్మిస్తున్న ఐల్యాండ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని విశ్వసనీయంగా తెలిసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన భద్రకాళి చెరువుకు వందేండ్ల చరిత్ర ఉంది. నాటి నుంచి నేటి వరకు చెరువు పూడికతీత, చెత్తాచెదారంతో నిండిపోయి ఉంది. వరదలు ఉధృతంగా వచ్చిన సందర్భాల్లో వరంగల్ నగరంపై నీరు వచ్చేది. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చెరువు పూడికతీతకు రూ.11.50 కోట్లు కేటాయించింది. వరద నివారణ పనులకు రూ.158 కోట్లు మంజూరు చేసింది. చెరువులో 1.2 మీటర్ల (తవ్వి) మేరకు పూడికను తొలగించడానికి ఈ నిధులు కేటాయించగా, చెరువు పూడిక రవాణాకు సంబంధించి డీడీల రూపంలో ఒక్క క్యూబిక్ మీటర్‌కు రూ.71.83 వసూలు చేశారు. డీడీల రూపంలో ఇప్పటికే నీటిపారుదల శాఖకు రూ.2.6 కోట్ల మేరకు నగదు జమయ్యింది. 1972లో ఈ చెరువును నీటిపారుదల శాఖ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించింది. తాజాగా ఈ పనులను చేయడం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సాధ్యం కాదని నీటిపారుదల శాఖకు అప్పగించారు. నీటిపారుదల శాఖ ఈ చెరువులో 11.50 లక్షల క్యూబిక్ మీటర్లకుగాను 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను ఇప్పటి వరకు తీయగా, ‘కుడా’ 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీసే పనులను చేపట్టింది. ‘కుడా’ ఇప్పటి వరకు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించింది.
35 శాతం పూడికతీత పూర్తి
భద్రకాళి చెరువు పూడికతీత, వరద నివారణ పనులకు సంబంధించి ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి చెరువు పూడిక తీత 50 శాతం పూర్తయ్యిందని మంత్రి ‘పొంగులేటి’ ప్రకటించారు. వాస్తవానికి అధికార వర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు కేవలం 35 శాతం పూడికతీత పనులు మాత్రమే పూర్తయ్యాయి. చెరువులో 14.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకుపోయింది. ఇందులో నీటిపారుదల శాఖ తీయాల్సిన 11.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీతలో కేవలం 3 లక్షల క్యూబిక్ మీటర్లను మాత్రమే తొలగించారు. ‘కుడా’ తీయాల్సిన 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీతలో 2 లక్షల క్యూబిక్ మీటర్లు తీసివేయగలిగింది. చెరువులో 1.2 మీటర్ల మేరకు తవ్వి పూడిక తీయడం ద్వారా మొత్తంగా 18 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించాలని నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే మంత్రులు మాత్రం భద్రకాళి పూడికతీత 50 శాతం పూర్తయ్యిందని, మిగతా 50శాతాన్ని జూన్ 15వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించడం గమనార్హం.
70-100 ఎకరాల చెరువు భూములు కబ్జా
భద్రకాళి చెరువు 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉండగా, నేడు చెరువు 382 ఎకరాలకు కుదించబడింది. 70-100 ఎకరాల మేరకు చెరువు భూములు కబ్జాకు గురయ్యాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు, ‘కుడా’ అధికారులు కలిసి ఈ చెరువులోకి మురుగు చేరొద్దని నిర్మించిన కట్టతో కబ్జాలకు లైసెన్స్ ఇచ్చినట్టయ్యింది. దాంతో పెద్ద ఎత్తున కబ్జాదారులు చెరువు భూములను కబ్జా చేసి అక్రమంగా డాక్యుమెంట్లను సృష్టించి విచ్చలవిడిగా భవనాలను నిర్మించారు.
‘భద్రి’లో ఆక్రమణలు వద్దు..
భద్రకాళి చెరువులో కబ్జాలు అధికమై వందల ఎకరాల చెరువు కుదించుకుపోయిన నేపథ్యంలో మళ్లీ అభివృద్ధి పేరిట చెరువు విస్తీర్ణాన్ని మరింత తగ్గించడం సరైన నిర్ణయం కాదు. చెరువు మధ్యలో ఎలాంటి నిర్మాణాలకూ అనుమతులు ఇవ్వకూడదు. ఉన్న చెరువుల విస్తీర్ణాన్ని కూడా కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు.
పుల్లూరి సుధాకర్, ఫోరం ఫర్ బెటర్ వరంగల్
పది రోజులుగా పూడికతీత పెండింగ్..
భద్రకాళి చెరువులో పూడిక తీత పనులు పది రోజులుగా నిలిచిపోయాయి. మంత్రులు వచ్చిన సందర్భంలోనూ పూడికతీత పనులు నిలిచిపోయాయి. ఒకవైపు ఎండాకాలం ముగుస్తుండటంతో పూడికతీత పనులు పూర్తికాకపోతే వర్షాలు పడితే చెరువులోకి వాహనాలు పోవడం, పూడికతీయడం సాధ్యం కాని పని. పూడిక మట్టిని తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సోమవారం నీటిపారుదల శాఖ రూ.14.13 కోట్ల అంచనా వ్యయంతో ఆన్‌లైన్ టెండర్‌లకు ఆహ్వానం పలికింది. వచ్చే సోమవారం ఈ టెండర్‌కు తుది గడువు ముగియనుంది. అప్పటి వరకు చెరువులో పూడిక తీత పనులు నిలిచిపోయినట్టే.
ఐల్యాండ్ నిర్మాణానికి అనుమతులేవీ..?
భద్రకాళి చెరువులో ‘కుడా’ అధికారులు ఐల్యాండ్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఐల్యాండ్ నిర్మాణానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గాని, నీటిపారుదల శాఖ నుంచి గాని అనుమతులు తీసుకోలేదు. భద్రకాళి చెరువులో పూడిక తీయడానికి రూ.11.50 కోట్లను ఒకవైపు ఖర్చు పెడుతుండగా, మరోవైపు చెరువు మధ్యలో ఐల్యాండ్ నిర్మించడానికి మట్టిని గుట్టగా ‘కుడా’ పేర్చుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చెరువు విస్తీర్ణం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ‘కుడా’ చేస్తున్న పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రకాళి చెరువు 2010-11 నుంచి పెద్ద ఎత్తున కబ్జాలకు గురైందన్న ఆరోపణలున్నాయి. 70-100 ఎకరాల చెరువు భూమి కబ్జాకు గురైన నేపథ్యంలో తాజాగా చేపడుతున్న పనులు సైతం చెరువు విస్తీర్ణాన్ని తగ్గించడం పట్ల నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.