– దర్యాప్తు కమిటీ నివేదికల వివరణ కోరిన సీజేఐ
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలేనని సుప్రీం కోర్టు నియమించిన దర్యాప్తు కమిటీ తన విచారణా నివేదికలో నిర్ధారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నివేదికలోని కీలకమైన నిర్ధారణల దృష్ట్యా న్యాయమూర్తిని పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కోరినట్లు తెలిసింది. దర్యాప్తు కమిటీ నివేదికను జస్టిస్ వర్మకు సీజేఐ పంపించారు. సహజ న్యాయం సూత్రం ఆధారంగా సమాధానం ఇవ్వాల్సిందిగా కోరారని ఆ వర్గాలు తెలిపాయి.
పంజాబ్-హర్యానా హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ షీల్ నాగు, జి.ఎస్.సంథావాలియా, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ నివేదికను సీజేఐకి అందచేఇంది. మే 3న దీన్ని ఖరారు చేశారు. 50మందికి పైగా వ్యక్తుల స్టేట్‌మెంట్‌లను, సాక్ష్యాధారాలను దర్యాప్తు కమిటీ విశ్లేషించింది. వీరిలో ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజరు అరోరా, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్‌లు కూడా వున్నారు.
మార్చి 14న రాత్రి 11.35గంటలకు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వర్మ అధికార నివాసంలోని స్టోర్‌రూమ్‌లో పెద్ద మొత్తంలో నగదు కట్టలు వున్నాయని వచ్చిన ఆరోపణలను ధ్రువీకరించేందుక స్పష్టమైన సాక్ష్యాధారాలు వున్నాయని కమిటీ కనుగొంది. కాగా ఈ నెల 13న పదవీ విరమణ చేయనున్న సీజేఐ ఖన్నా ఈ అంశాన్ని పరిష్కరించే అవకాశం వుంది. సీనియర్ కొలీజియం సభ్యులతో ఆయన ఈ నివేదికలోని అంశాలను చర్చించినట్లు తెలిసిందని ఆ వర్గాలు తెలిపాయి.
జస్టిస్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు కట్టలు దొరికిన నేపథ్యంలో ఈ విషయమై పెద్ద వివాదం రేగడంతో పలు చర్యలు తీసుకున్నారు. త్రిసభ్య విచారణా కమిటీని వేయడం, ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ వర్మ నుండి జ్యుడీషియల్ కార్యకలాపాలను తొలగించడం, తర్వాత ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం వంటి పలు పరిణామాలు సంభవించాయి. అలహాబాద్ హైకోర్టులో ఎలాంటి జ్యుడీషియల్ కార్యకలాపాలు వర్మకు అప్పగించరాదని మార్చి 28న సుప్రీం కోర్టు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరింది.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలే!
- Advertisement -
- Advertisement -