నవతెలంగాణ – లండన్ : బ్రిటన్ రాజధాని లండన్ శనివారం నిరసనలతో హోరెత్తింది. మితవాద కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో నిర్వహించిన ‘యునైటెడ్ ది కింగ్‌డమ్’ ర్యాలీలో లక్షకు పైగా ఆందోళనకారులు పాల్గొన్నారు. బిగ్ బెన్ నుండి థేమ్స్ నది మీదుగా, వాటార్లు రైల్ స్టేషన్ మీదుగా సుమారు ఒక కిలోమీటరు మేర ఆందోళనకారుల సమూహం నిండిపోయింది. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ పేరుతో మరో నిరసన జరిగింది. ఈ నిరసనలో సుమారు ఐదువేలమంది పాల్గన్నారు. రెండు గ్రూపుల మధ్య విభేదాలు రాకుండా ముందుజాగ్రత్త చర్యగా భారీగా భద్రతా దళాలను మోహరించారు. అయితే యునైటెడ్ కింగ్ డమ్ మద్దతుదారులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డారు. కంచెలను దాటుకుని వచ్చేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులపై బాటిల్స్‌ను విసిరిగొట్టడంతో పాటు వ్యక్తిగతంగా దాడికి యత్నించినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. సుమారు తొమ్మిది మందిని అరెస్ట్ చేశామని అన్నారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నామని అన్నారు.
రాబిన్సన్ అలియాస్ స్టీఫెన్ యాక్సీ లెన్నాన్ జాతీయ వాద మరియు ఇస్లాం వ్యతిరేక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్‌ను స్థాపించారు. బ్రిటన్‌లో ప్రముఖ మితవాద వ్యక్తుల్లో ఆయన ఒకరు. యుకె ప్రధాని కీర్ స్టార్మర్‌కు వ్యతిరేకంగా మరియు ‘వలసలను ఆపండి’, ‘శరణార్థులను తిరిగి పంపండి, ‘మా పిల్లలను రక్షించండి’ అంటూ నినాదాలు చేశారు. రెండు రోజుల క్రితం హత్యకు గురైన అమెరికా కార్యకర్త చార్లీ కిర్క్‌కి నివాళులు అర్పించారు. ఇటీవల నిర్వహించిన అతిపెద్ద ర్యాలీల్లో ఇది ఒకటని మెట్రో పాలిటన్ పోలీసులు తెలిపారు. 2023 నవంబర్‌లో పాలస్తీనా మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సుమారు 3,00,000మంది పాల్గొన్నారు.