నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఓ ఉన్నత పోలీస్ అధికారిపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశమైంది. రత్లాం జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయన, అక్కడి ఏర్పాట్లపై అసంతృప్తితో ఎస్పీపై అందరి ముందే విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది.
రత్లాం జిల్లా పరిధిలోని కరియా గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు మోహన్ యాదవ్ వెళ్లారు. ఆయన పొలాల్లో నడుస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ఆయన్ను చుట్టుముట్టారు. దీంతో అక్కడ తోపులాట జరిగి జన నియంత్రణ కొరవడింది. ఈ పరిణామంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం తన పర్యటనను మధ్యలోనే ఆపి “ఎస్పీ ఎక్కడ? ఏర్పాట్లు కూడా నేనే చూసుకోవాలా?” అంటూ గట్టిగా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని గమనించిన ఎస్పీ అమిత్ కుమార్ వెంటనే అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా “అవును సార్, నేనే చూసుకుంటాను సార్” అంటూ ఆయన పదేపదే తలూపడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనతో అధికార యంత్రాంగంలో కలకలం రేగింది.
ఈ వీడియో బయటకు రావడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా లోపాలను ఎత్తిచూపడంలో తప్పులేదని ఆయన మద్దతుదారులు సమర్థిస్తుండగా, ఒక ఉన్నతాధికారిని బహిరంగంగా మందలించడం వల్ల సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఇలాంటి విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడాల్సిందని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నేత జీతూ పట్వారీ స్పందిస్తూ ముఖ్యమంత్రి తీరును తప్పుపట్టారు. “ముఖ్యమంత్రి గారూ, మీరు ఫోటోలు, వీడియోలు, మీడియా హెడ్‌లైన్స్ కోసమే పనిచేస్తున్నట్లుంది. కానీ రైతులకు కావాల్సింది సర్వేలు, ఎరువులు, విత్తనాలు, బీమా, నష్టపరిహారం. దయచేసి వాటిపై దృష్టి పెట్టండి” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.