నవతెలంగాణ – హైదరాబాద్: రైలు ప్రయాణంలో ప్యాంట్రీ సిబ్బంది దోపిడీని ప్రశ్నించిన ఓ ప్రయాణికుడిపై సిబ్బంది దాడి చేశారు. అప్పర్ బెర్త్ లో పడుకున్న ప్రయాణికుడిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసిన పాపానికి ఇలా దాడి చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు. సదరు ప్యాంట్రీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హేమకుండ్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం సందర్భంగా తనకు ఎదురైన అనుభవాలను విశాల్ శర్మ అనే యూట్యూబర్ వీడియో తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. వాటర్ బాటిల్, కాఫీ సహా రైలులో అన్ని పదార్థాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కాసేపటికి ప్యాంట్రీ మేనేజర్ తన సిబ్బందితో కలిసి విశాల్ శర్మ సీటు వద్దకు వచ్చాడు. ఫిర్యాదు చేసింది నువ్వేనా అని ప్రశ్నిస్తూ పక్కకు రమ్మని పిలిచాడు. ఎందుకు రావాలని ప్రశ్నించిన విశాల్ శర్మపై దౌర్జన్యం చేశాడు. అప్పర్ బెర్త్ పైకి ఎక్కి శర్మపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిని తన సెల్ ఫోన్ లో రికార్డు చేసిన శర్మ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ప్యాంట్రీ సిబ్బంది దౌర్జన్యంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ, రైల్ సేవా స్పందిస్తూ.. ప్రయాణికుడిపై ప్యాంట్రీ సిబ్బంది దాడి ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. క్యాటరర్ పై రూ.5 లక్షల జరిమానా విధించడంతో పాటు కథువా రైల్వే స్టేషన్ లో జీఆర్పీఎస్ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ప్యాంట్రీ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు జీఆర్పీఎస్ సిబ్బంది తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రయాణికుడిపై రైల్వే ప్యాంట్రీ సిబ్బంది దాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES