నవతెలంగాణ-హైదరాబాద్: మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా కొన్ని ముఖ్యమైన షరతులతో ఆయుధాలను విడిచిపెడతామని మావోయిస్టులు ప్రకటించారు. మావోయిష్టుల నుండి మంగళవారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది. ఈ లేఖను పరిశీలిస్తున్నామని, విషయాలను ధ్రువీకరించాల్సి వుందని రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ, పోలీసులు మీడియాకి వివరించారు.
సీపీఐ(మావోయిష్టులు) ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైన పత్రికా ప్రకటనలో ఈ విధంగా ఉంది. ”మావోయిస్టులు తమ మద్దతుదారులు, కార్యకర్తల నుండి ఫేస్‌బుక్, ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను కోరుతున్నాం. జైలులో ఉన్న తమ కార్యకర్తలతో చర్చలు జరపవలసిన అవసరాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపింది”. ”శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి, మారిన ప్రపంచ, దేశ పరిస్థితులను, అలాగే ప్రధాని, హోంమంత్రి, సీనియర్ పోలీస్ అధికారులు ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, మేము ఆయుధాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నాం. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలతో కలిసి పోరాడతాము” అని లేఖలో పేర్కొన్నారు.
”ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన ప్రత్యేక ప్రతినిధి బృందంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం” అని కూడా పేర్కొంది. ”ఈ అంశానికి మద్దతు తెలిపే లేదా వ్యతిరేకించే, శాంతి చర్చల్లో పాల్గొనే ప్రతినిధి బృందాన్ని సిద్ధం చేస్తాము” అని లేఖ పేర్కొంది.
ఆయుధాలను విడిచిపెడతామని, అయితే ప్రభుత్వం నెల రోజుల పాటు గాలింపు కార్యకలాపాలను, కాల్పులను నిలిపివేయాలన్న షరతును లేఖలో పునరుద్ఘాటించారు. ”మే 10న మా ప్రధాన కార్యదర్శి అభయ్ పేరుతో కాల్పుల విరమణను ప్రతిపాదిస్తూ, ఆయుధాలను విడిచిపెట్టడంపై అత్యున్నత నాయకత్వంతో సంప్రదించడానికి నెలరోజుల సమయం కావాలని కోరుతూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాం. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు” అని లేఖ పేర్కొంది.
మావోయిష్టుల లేఖ ప్రామాణికతను ధ్రువీకరిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజి పి.సుందర్ రాజ్ పేర్కొన్నారు. ఏ నిర్ణయమైన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉంటుందని అన్నారు. వారితో ఒప్పందం లేదా చర్చలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, పరిస్థితులను తగిన విధంగా పరిశీలించి అంచనా వేసిన తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.