నవతెలంగాణ – హైదరాబాద్: నేపాల్‌లో యువత ఆందోళనల కారణంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలీ పది రోజుల తర్వాత తొలిసారిగా బయటి ప్రపంచానికి కనిపించారు. తీవ్ర నిరసనల మధ్య సైనిక శిబిరంలో తలదాచుకున్న ఆయన, గురువారం సైనిక హెలికాప్టర్‌లో భద్రత నడుమ భక్తపూర్‌లోని ఓ అద్దె ఇంటికి మారారు. ఆయన తన కొత్త నివాసానికి చేరుకున్నప్పుడు కొంతమంది మద్దతుదారులు మాత్రమే ఆయనకు స్వాగతం పలికారు.
దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఆందోళనల్లో నిరసనకారులు ఖాట్మండు, ఝాపా, దమక్‌లలో ఉన్న ఓలీకి చెందిన సొంత ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆయన ఉండేందుకు ఇల్లు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయన కోసం భక్తపూర్‌లో కొత్తగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శివపురి సైనిక శిబిరం నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో ఆయన్ను ఇక్కడికి తరలించారు.