– చెరువులు, నాలాలు ఆక్రమించిన వారికే భయం
– హైదరాబాద్‌కు ఢిల్లీలాంటి పరిస్థితి రానివ్వొద్దనే ‘హైడ్రా’ తెచ్చాం
– మూసీ నది పరివాహక ప్రజలతో త్వరలో ఆత్మీయ సమ్మేళనం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
– హైడ్రా పోలీసు స్టేషన్ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
”ఒక మంచి ఆలోచనతో హైడ్రాను ఏర్పాటు చేశాం.. అక్రమ నిర్మాణాలు.. ఆక్రమణల విషయంలో ఎన్ని ఒత్తిళ్లొచ్చినా ఎవరినీ వదలొద్దు.. మీ వెంట నేనున్నా.. ఢిల్లీలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావొద్దనే హైడ్రాను తీసుకొచ్చాం..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ బుద్దభవన్‌లో గురువారం హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు. బెంగళూరులో గత ఏడాది వేసవిలో నీటి కరువు వచ్చిందని, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో వరదలు రావడంతో అతలాకుతలమైనట్టు వివరించారు. 2, 3 అంతస్తుల భవనాలు సైతం మునిగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి జీవించలేని పరిస్థితి నెలకొందని, మెట్రోనగరాల్లో వస్తున్న ఉపద్రవం నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే మనకూ నష్టం జరుగుతుందని చెప్పారు. అలాంటి నగరాల సరసన హైదరాబాద్ చేరకూడదనే ఉద్దేశంతోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హైడ్రా అంటే పేదల ఇండ్లు కూల్చుతుందని కొంతమంది తప్పుగా చిత్రీకరిస్తున్నారని.. హైడ్రా అంటే కూల్చడమే కాదు, ఆస్తులను రక్షించడం, విపత్తుల నిర్వహణ అని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఆక్రమణలను నియంత్రించదలచుకున్నామని స్పష్టం చేశారు. పేదలను, పెద్దలను ఒకేలా చూడొద్దన్నారు.
నిజాం సర్కార్‌ను కదిలించింది
ప్రకృతిని కాపాడితే అది మనలను కాపాడుతుందని సీఎం అన్నారు. పూర్వీకులు మనకు ఇచ్చిన చెరువులను కాపాడుకోవాలని, చెరువులు కనుమరుగైతే మనుగడ ఉండదని అన్నారు. 450 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని కాపాడుకొనేందుకు హైడ్రా ఉపయోగపడుతుందన్నారు. 1908లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు అప్పటి నిజాం సర్కార్‌ను కదిలించాయని చెప్పారు. దాంతో గొప్ప ఇంజినీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి హైదరాబాద్‌లో మూసీపై డ్రయినేజీ వ్యవస్థ నిర్మించారని గుర్తు చేశారు. తదనంతరం క్రమంగా నగరం విస్తరించడం, జనాభా పెరగడం.. ఆక్రమణలూ పెరగడం వల్ల నేడు చిన్న వర్షం వస్తే నగరంలో కాలనీలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కాలనీలకు వెళ్లే దారులను పెద్దలు ఆక్రమిస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కాలనీల రోడ్లను హైడ్రా రక్షిస్తోందన్నారు. లేక్‌వ్యూ ఫేస్‌తో చెరువుల పక్కన కొందరు ఫామ్‌హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు నిర్మించుకున్నారని, వాటి నుంచి వ్యర్థాలు, మురుగునీటిని చెరువుల్లోకి వదులుతున్నారని తెలిపారు. చెరువులు, నాలాలు ఆక్రమించిన వారికే హైడ్రా అంటే భయమని చెప్పారు. మూసీ పక్కన పడుకుంటే అక్కడ కష్టాలు ఎలా ఉంటాయో ఆ నేతలకు తెలుస్తాయని తెలిపారు. మూసీ నది పరివాహక ప్రజలతో త్వరలోనే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు.
వాళ్లు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?
మూసీని ప్రక్షాళనను కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సబర్మతి, గంగా నది, యమునా నదిని బీజేపీ ప్రభుత్వం ప్రక్షాళన చేయలేదా? వారు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. మూసీలో ఆక్రమణలు తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో అభివృద్ధి పనులు చేపడితే దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఐఎంజీ భారత్ అనే సంస్థ చేతిలో ఉన్న 400 ఎకరాల భూములను తామే కాపాడామని తెలిపారు. ఆ 400 ఎకరాలు ప్రయివేటు వ్యక్తి చేతుల్లో ఉంటే గత ప్రభుత్వం పదేండ్లు పట్టించుకోలేదని విమర్శించారు. తాము కాపాడిన భూముల్లో కంపెనీలు నిర్మిస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ నగరం అభివృద్ధి కాకుండా, కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుతగులుతున్నారని తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్‌తోపాటు హైడ్రాకు సమకూర్చిన వాహనాలు, యంత్రాలను సైతం సీఎం ప్రారంభించారు.
మరింత బలం చేకూరింది: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రాకు పోలీస్ స్టేషన్ రావడంతో మరింత బలంతో డైందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు హైడ్రా 3600 కేసులను పరిష్కరించిందని, 30 టీమ్స్ పనిచేస్తున్నాయని వివరించారు. రాబోవు రోజుల్లో 71 బృందాలను ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. హైడ్రా పోలీస్‌స్టేషన్ ఇవ్వడం, దానికి కావాల్సిన సిబ్బందిని కేటాయించడంతో సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముంపు బాధితుల సమస్యలను హైడ్రా వెంటనే పరిష్కరిస్తుందని చెప్పారు. ప్రజలు ఏ విభాగాన్ని సంప్రదించాలో తెలియని సమస్యల్ని సైతం హైడ్రా పరిష్కరిస్తోందన్నారు. హైడ్రా వల్ల చెరువులు, నాలాల కబ్జాలు తగ్గిపోతున్నాయన్నారు. గత జూన్ 19న ఏర్పడిన హైడ్రా పనితీరు, పలు కార్యక్రమాలను రంగనాథ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, హౌం సెక్రటరీ రవి గుప్తా, ఎంఏయూడీ కమిషనర్ ఇలంబర్తీ, పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్ని ఒత్తిళ్లొచ్చినా ఎవరినీ వదలొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES