Friday, May 9, 2025
Homeప్రధాన వార్తలుపార్టీలు…సిద్ధాంతాలు వేరైనా…దేశ కోసం ఒక్కటవుతాం

పార్టీలు…సిద్ధాంతాలు వేరైనా…దేశ కోసం ఒక్కటవుతాం

- Advertisement -

– మనవైపు కన్నెత్తి చూసిన వారికి భూమిపై నూకలు చెల్లుతారు : జాతీయ సంఘీభావ ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాజకీయ పార్టీలు.. వాటి సిద్ధాంతాలు వేరైనా… దేశ రక్షణ కోసం అందరం ఒక్కటవుదామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశం వైపు కన్నెత్తి చూస్తే వారికి భూమిపై నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంపూర్ణ మద్దతు తెలిపారని గుర్తు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయం ముందున్న రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ రవి గుప్తా ర్యాలీలో అగ్రభాగాన నడిచారు. ఈ సందర్భంగా ‘జై జవాన్‌, జై హింద్‌, వందేమాతరం’ నినాదాలతో మార్మోగాయి. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత కొంత కాలంగా ఉగ్రవాదులు దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకుని వస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహంతో భారతీయ పౌరులను మట్టుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మన అమ్మలు, అక్కలు, చెలెళ్ల నొదుటి సింధురాన్ని తూడ్చేశారని వాపోయారు. భారతీయులపై దాడి చేశామంటూ ఉగ్రవాదులు విర్రవీగారని తెలిపారు. 140 కోట్ల భారతీయుల పక్షాన భారత సైన్యం వారికి గుణపాఠం చెప్పిందన్నారు. దేశ సార్వభౌమాధికారంపై ఎవరూ దాడి చేసినా వదలబోమని హెచ్చరించారు. శాంతియుత మార్గం ద్వారానే మహాత్మగాంధీ నాయకత్వంలో బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి దేశానికి విముక్తి లభించిందన్నారు.అయితే శాంతికాముకులైన భారతీయులు దాడి చేసినా ఊరుకుంటారని భావించొద్దని హెచ్చరించారు. దేశంపై దాడి జరిగితే భారతీయులు గొప్ప స్ఫూర్తిని ప్రదర్శిస్తారని చెప్పారు. భారతీయుల శాంతి స్వభావాన్ని చేతగానితనంగా భావించొద్దంటూ పాకిస్తాన్‌ను హెచ్చరించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌తోపాటు టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ, సచివాలయ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు, ఆర్మీ మాజీ అధికారులు, మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -