నవతెలంగాణ-హైదరాబాద్ : రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు. 2026లో జరిగే ఎన్నికల తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ… “రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఏ నియోజకవర్గాల్లో మనకు బలం ఉందో గుర్తించి, అక్కడ మరింత పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. దీనికోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. 2026లో తమిళనాడు అసెంబ్లీకి మన పార్టీ తరఫున ప్రతినిధులను పంపిస్తామన్న నమ్మకం నాకుంది” అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
2018లో రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్ హాసన్, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. స్వయంగా కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కమల్ హాసన్ సైతం బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
అయితే, ఆ ఎన్నికల ఫలితాల తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్న కమల్ హాసన్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమిలో చేరారు. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు పలకడంతో సీఎం స్టాలిన్ ఆయనను రాజ్యసభకు పంపించారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్నందున, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎంఎన్ఎంకు కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ ఇప్పటినుంచే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.