నవతెలంగాణ-హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి, కన్న కూతురినే కిరాతకంగా హతమార్చాడు. ఏడుపు ఆపడం లేదన్న ఆగ్రహంతో ఏడాది పసికందును కాళ్లు పట్టుకుని నెలకేసి కొట్టడంతో చిన్నారి మృతి చెందింది.
ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన వెంకటేశ్.. రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో తరుచు గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో వారి 12 నెలల కూతురు భవిజ్ఞ ఏడుపు మొదలుపెట్టింది. మద్యం మత్తులో భార్యపై కోపంతో విచక్షణ కోల్పోయి పసికందును నెలకేసి కొట్టాడు. దాంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పాపను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు నిందితుడైన తండ్రి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.