Friday, May 9, 2025
Homeజాతీయంకాశ్మీర్‌కు అఖిలపక్ష బృందాన్ని పంపాలి

కాశ్మీర్‌కు అఖిలపక్ష బృందాన్ని పంపాలి

- Advertisement -

– పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి : అఖిల పక్షంలో సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ:
ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి సీపీఐ(ఎం) తరపున రాజ్యసభ ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ హాజరయ్యారు. ఇంత కీలకమైన అఖిల పక్ష సమావేశానికి వరుసగా రెండోసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాకపోవడం పట్ల జాన్‌ బ్రిట్టాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని కూడా పాల్గొనేలా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘ఆపరేషన్‌ ఉద్దేశిత లక్ష్యాలు సాధించామని’ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో బ్రిట్టాస్‌ మాట్లాడుతూ, గతంలో వున్న అనుభవాలను బట్టి చూసినట్లైతే, ఇలాంటి మిలటరీ చర్యలతో ఉగ్రవాద గ్రూపులను లక్ష్యంగా చేసుకోవడం, నిర్మూలించడం సాధ్యమ వుతుందా అనేది సందేహమేనన్నారు. ప్రభుత్వం, ఒకపక్క దౌత్య చర్యలను కొనసాగిస్తూనే మరోపక్క పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని ఆయన నొక్కి చెప్పారు. పరిస్థితులు పెచ్చరిల్లకుండా చూడాలని కూడా కోరారు.
సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అవసరమైన సాయాన్ని అందించాల్సి వుందన్నారు. అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచాలని, అన్ని రకాల తప్పుడు సమాచారం వ్యాప్తిని తిప్పికొట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్వేషం వ్యాప్తి చెందకుండా అణచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బ్రిట్టాస్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని ఆయన నొక్కి చెప్పారు. విద్వేష వ్యాప్తిపై పోరాడకుండా ఉగ్రవాదంపై యుద్దాన్ని చేపట్టలేమన్నారు. ఉగ్రవాదం ప్రభావాలన్నింటినీ అనుభవించిన తర్వాత కూడా, అత్యంత దయ, కరుణలతో సమైక్యంగా ఉగ్రవాదాన్ని ఖండించడం ద్వారా పహల్గాం, కాశ్మీర్‌ ప్రజలు యావత్‌ దేశానికి దారి చూపించారని ఆయన ప్రశంసించారు. ఇబ్బందులు పడుతున్న కాశ్మీర్‌ ప్రజలకు బాసటగా నిలిచేందుకు సరైన సమయంలో కాశ్మీర్‌కు ప్రభుత్వ నేతృత్వంలో అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -