నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి, అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
గాజులరామారంలోని సర్వే నంబర్ 397 పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.4500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుంచి 70 గజాల చిన్న ప్లాట్లు చేసి, ఒక్కో ఇంటిని సుమారు రూ.10 లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ నేపథ్యంలో శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్, హైడ్రా ఉన్నతాధికారులు స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఆక్రమణల తీవ్రతను పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం నుంచే భారీ భద్రత నడుమ కూల్చివేతలను మొదలుపెట్టారు.
అయితే, తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది, పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికుల ఆందోళనలు, నిరసనల మధ్యే అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్‌తో గాజులరామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.