నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఈ వారం హౌస్ నుంచి మర్యాద మనీష్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. ఫ్లోరా సైనీ ఎలిమినేట్ అవుతుందని హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం భావించినప్పటికీ, చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.
ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా, హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ వచ్చారు. మొదట భరణి, హరీష్, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, ప్రియ సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. చివరకు ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్ మాత్రమే డేంజర్ జోన్‌లో నిలిచారు. దీంతో వారిద్దరినీ యాక్టివిటీ ఏరియాకు పిలిచిన నాగార్జున, కాసేపు ఉత్కంఠను కొనసాగించారు.
యాక్టివిటీ ఏరియాలో ఉన్న సమయంలో తానే ఎలిమినేట్ కాబోతున్నానని భావించిన ఫ్లోరా సైతం మనీష్‌కు ధైర్యం చెప్పడం గమనార్హం. హౌస్‌లోని ఓనర్లు, టెనెంట్లు అందరూ ఫ్లోరానే వెళ్లిపోతుందని దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫ్లోరా సేవ్ అయినట్లు, మనీష్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ ఊహించని పరిణామంతో ఇమ్మానుయేల్‌తో సహా హౌస్‌మేట్స్ అందరూ షాక్‌కు గురయ్యారు.
హౌస్ వీడే ముందు, నాగార్జున కోరిక మేరకు మనీష్ తన దృష్టిలో టాప్-3, బాటమ్-3 కంటెస్టెంట్లు ఎవరో చెప్పాడు. బాటమ్-3లో దమ్ము శ్రీజ, ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి పేర్లను పేర్కొన్నాడు. ఇక, టాప్-3లో భరణి, ఇమ్మానుయేల్‌లతో పాటు హరిత హరీశ్, సంజన చక్కగా ఆడుతున్నారని వారి పేర్లను కూడా ప్రస్తావించాడు. అనంతరం మనీష్ బిగ్‌బాస్ హౌస్‌కు వీడ్కోలు పలికాడు.