నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్– పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాడులు మరింత తీవ్రం కావచ్చనే భయంతో జమ్మూ నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే, బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంది. జమ్మూ ప్రజల ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. జమ్మూ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. జమ్మూ, ఉధంపూర్ ల నుంచి ఢిల్లీకి ఈ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.