నవతెలంగాణ-హైదరాబాద్: దసరా పండగ సందర్భంగ థియేటర్లలో వచ్చే పెద్ద సినిమాల హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) బరిలో కొస్తున్న పెద్ద సినిమా. ఈనెల 25న ఈ సినిమా విడుదల కానుంది. గ్రాఫిక్స్ పనులు పూర్తికాని కారణంగా బాలకృష్ణ ‘అఖండ 2’, సాయి దుర్గాతేజ్ నటించిన ‘సంబరాల యేటిగట్టు’ సినిమాల విడుదలలు వాయిదా పడ్డాయి. కన్నడ నటుడు రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార : చాప్టర్ 1’ ప్రీక్వెల్‌గా అక్టోబర్ 2న దసరారోజు విడుదల కానుంది.పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రం తెరకెక్కింది. ప్రియాంక మోహన్ కథానాయిక. ఇమ్రాన్ హష్మీ ముఖ్య భూమిక పోషించారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రం విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకొన్నాయి. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ పోషించిన సత్య దాదా పాత్ర లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాయి. స్పెషల్ ప్రీమియర్ షోకు అధికారులు అనుమతి ఇచ్చారు.
తెలంగాణాలో సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటలకు స్పెషల్ ప్రీమియర్‌కి అనుమతిచ్చారు. టికెట్ రేటు రూ. 800గా ఖరారు చేశారు. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ రూ.100, మల్టీఫ్లెక్స్ రూ.150గా ఫైనల్ చేశారు. ఏపీలో ఏకంగా బెనిఫిట్ షో టికెట్ ధరలను రూ.1000 వసూలు చేసుకునేందుకు అనుమతులిచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 ఒక్కో టికెట్‌పై పెంపునకు అనుమతులు జారీ చేశారు. శుక్రవారంనాడు ఈ సినిమా నుంచి పవన్ పాడిన ‘వాషి యో వాషి’ అనే ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్ర బృందం ఆవిష్కరించింది.
దసరా రోజునే ‘కాంతార 1’ : కన్నడ నటుడు రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న సినిమా ‘కాంతార : చాప్టర్ 1’. అక్టోబర్ రెండోతేదీన ఈ సినిమా విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. రుక్మిణి వసంత్ కథానాయిక. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.