నవతెలంగాణ-హైదరాబాద్ : ఆ యువతి ఉద్యోగ కల సాకారమైంది.. బెంగళూరులో సోమవారం ఉద్యోగంలో చేరాల్సి ఉండగా ఈలోపే రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్‌లో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం సినిమా సన్నివేశం తలపించేలా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం చిక్కేపల్లికి చెందిన రంజిత్‌కుమార్‌రెడ్డి (34) భార్యతో కలిసి పెద్దలపండగకు శనివారం పెద్దమందడి మండలం వెలటూరులో ఉన్న అత్తగారింటికి వచ్చారు. ఆయన మరదలు (భార్య సోదరి) గుడిబండ హారిక (23)కు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. సోమవారం ఉద్యోగంలో చేరాల్సి ఉండగా రంజిత్‌కుమార్‌రెడ్డితో కలిసి తెల్లవారుజామున కారులో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. రాజాపూర్ శివారులో జడ్చర్ల వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో అదుపుతప్పి విభాగినిని ఢీకొని శంషాబాద్ వెళ్తున్న రంజిత్‌కుమార్‌రెడ్డి కారుపై పడింది. ప్రమాదంలో బావ, మరదలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. కారులో ఇరుక్కొన్న మృతదేహాలను బాలానగర్ ఎస్సై లెనిన్, పోలీసులు, స్థానికులు బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బీరం సుదర్శన్‌రెడ్డి, రాధమ్మ దంపతుల ఏకైక కుమారుడు రంజిత్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య చైతన్య గర్భిణి కాగా, 18 నెలల కుమార్తె ఉన్నారు. ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాజాపూర్ ఏఎస్సై లక్ష్మయ్య తెలిపారు.