– 42 ఏళ్లుగా ఇంటికి రాని కడారి
– ఉద్యోగం నుంచి ఉద్యమంలోకి..
– అంబుజ్ ఘడ్ ఎన్కౌంటర్ తో గోపాల్ రావు పల్లెలో విషాదం
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల
అర్థ శతాబ్దపు సాయుధ ఉద్యమంలో తొలి తరానికి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కోస 42 ఏళ్ల ప్రస్థానం నేటికీ ముగిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్ రావు పల్లి కి చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోస (70) సోమవారం చత్తిస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అంబుజ్ గాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీస్ బలగాలు ప్రకటించాయి. కడారి సత్యనారాయణరెడ్డి గోపాల్ రావు పల్లికి చెందిన వ్యక్తి కాగా ఆయన పదవ తరగతి వరకు సిరిసిల్లలోనే విద్యనభ్యసించాడు.
పెద్దపల్లిలో ఐటిఐ పూర్తి చేశాడు అనంతరం బసంత్ నగర్ లో ఆయనకు ఉద్యోగం రావడంతో ఉద్యోగరీత్యా బసంత్ నగర్ కు వెళ్లి 1983లో అక్కడి నుంచే కడారి విప్లవ పార్టీల భావజాలకు ఆకర్షితుడై అప్పటి పిపుల్స్ వార్ లో చేరాడు. అంచలంచలుగా దళ సభ్యుడు నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. కడారి మావోయిస్టులోకి వెళ్లిన తర్వాత ఒకసారి కూడా తిరిగి తన స్వగ్రామం వైపు రాలేదు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కలవకుండా మావోయిస్టు లోనే ఉండిపోయాడు. తల్లిదండ్రులు మరణించినప్పుడు వస్తాడు అనుకుని పోలీసులు నిఘా ఉంచినప్పటికీ కడారి సత్యనారాయణరెడ్డి తల్లిదండ్రులను ఆఖరి చూపులు కూడా రాలేదు. ఆయనకు ఒక సోదరుడు ఉండగా అతను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మండల విద్యాధికారిగా పనిచేసి పదవి విరమణ పొందారు.
కడారి సత్యనారాయణ రెడ్డి పై 40 లక్షల రివార్డు ఉంది. ఆయన ఎన్కౌంటర్లో మృతి చెందాడనే వార్త విన్న గ్రామం గోపాలరావు పల్లెలో విషాదం నెలకొంది. కడారి సత్యనారాయణరెడ్డి మృతదేహం కోసం గోపాల్ రావు పల్లె ప్రజలు, కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.