నవతెలంగాణ – హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వివాహిత కుమారుడికి వైద్యం చేయిస్తానని ఇంట్లో చెప్పి నాగోలులోని ఓ యువకుడి గదికి వెళ్లింది. రోజంతా అక్కడే గడిపిన ఆమె సాయంత్రానికి బాత్రూంలో చీరతో ఉరి వేసుకుంది. ఆ మహిళ తన గదిలో ఉందని బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన ఆ యువకుడు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. బాత్రూం తలుపులు బద్దలు కొట్టి లోపలకి వెళ్లేసరికి ఆమె ఊపిరి ఆడక మృతి చెందింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ యువకుడు కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషాదకర సంఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన 38 ఏళ్ల వివాహితకు భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమెకు నాగోలులోని అంధుల కాలనీలో ఉండే బానోత్ అనిల్ నాయక్(24) తో పరిచయం ఉంది. ఈ క్రమంలో కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఈ నెల 20న అనిల్ వద్దకు వచ్చింది. 21న రాత్రి వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఆ మహిళ బాత్రూంలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో బాత్రూం వెంటిలేటర్ నుంచి చూడగా ఆమె ఉరివేసుకోవడం కనిపించింది.
తలుపులు బద్దలు కొట్టి అనిల్ లోపలికి వెళ్లేలోపు ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో భయాందోళనలకు గురైన అనిల్.. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని తన చేతిని కోసుకున్నాడు. ఇంతలో ఆ మహిళ కుమారుడు ఏడుస్తూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలిసి నాగోలు చేరుకున్న మహిళ భర్త, బంధువులు.. అనిల్ ను కఠినంగా శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.