నవతెలంగాణ-హైదరాబాద్: యువత నిరుద్యోగానికి, ఓట్ల చోరీ వ్యవహారానికి డైరెక్ట్ లింకుందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల అభిష్టాలను తుంగలో తొక్కి, అధికారంలో కొనసాగడానికి రాజ్యాంగ వ్యవస్థలను దొంగలిస్తుందని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నిజాయితీగా గెలిచిన ఏ ప్రభుత్వమైనా..ప్రజల అవసరాలను తీరుస్తోందని, కానీ మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉందని, యువతకు సరైన ఉపాధిని కల్పించడంలో బీజేపీ విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ నిజాయితీగా గెలిచి ఉంటే నిజంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దొంగలించి ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఆరోపించారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లి దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడుతోందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
“దేశంలోని యువత కష్టపడి పనిచేస్తారు, కలలు కంటారు, తమ భవిష్యత్తు కోసం పోరాడుతారు. కానీ మిస్టర్ మోడీ తన ప్రజా సంబంధాలతో, ప్రముఖుల ప్రశంసలు పొందడంలో, బిలియనీర్లతో బిజీగా ఉన్నారు. యువత ఆశలను నీరుగార్చి, వారిని నిరాశకు గురిచేయడమే మోడీ ప్రభుత్వం లక్షణమని’ రాహుల్ ధ్వజమెత్తారు.