నవతెలంగాణ-హైదరాబాద్: స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ్ సారథిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బుధవారం ఢిల్లీ లోని వసంత్ కుంజా పీఎస్ లో 17మంది విద్యార్థులు ఆయనపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. స్వామి చైతన్యానంద సరస్వతి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అసభ్యకరమైన సందేశాలతో, శారీరక సంబంధాలు పెట్టుకోవాలని తమను బలవంతం చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా చైతన్యానంద సరస్వతి ప్రతిపాదనను అంగీకరించాలని విద్యాసంస్థలోని పలువురు అధ్యాపకులు తమని ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
“నిందితుడిని ఆగ్రా సమీపంలో గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని” డీసీపీ (సౌత్ వెస్ట్) అమిత్ గోయల్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా, నిందితుడికి చెందిన లగ్జరీ ఎర్ర వోల్వో కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనంలో నకిలీ ఐక్యరాజ్యసమితి (39 UN 1) నంబర్ ప్లేట్ గుర్తించామని. ఆ నంబర్ UN జారీ చేయలేదని, నిందితుడే దీనిని తయారు చేశాడని పోలీసులు నిర్ధారించారు.
ఒడిశాకు చెందిన ఈ బాబా 12 ఏళ్లుగా దిల్లీలోని ఆశ్రమంలో ఉంటున్నాడు. ఇక, ఆయనపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఒక మహిళ కూడా ఈతరహా వేధింపుల పైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. తాజా ఆరోపణల నేపథ్యంలో శ్రీ శృంగేరీ మఠం పాలకమండలి అతడిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అతడితో అన్ని సంబంధాలను తెంచుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. విద్యాసంస్థ ఈ మఠం ఆధ్వర్యంలోనే నడుస్తోంది.