నవతెలంగాణ-రామగిరి
ముంబైలో జరిగిన సమీక్షా సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్‌టిపిసి, ఇండియన్ ఆయిల్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ( ఎంపిసిబి) ఉన్నతాధికారులు పాల్గొని పరిశ్రమల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రతపై చర్చలు జరిపారు.ఈ సందర్భంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, రామగుండం ప్రాంతంలో గాలి కాలుష్యం ( ఏక్యూఐ 200కి మించి ఉండటం), విద్యుత్ కేంద్రాల కోసం భూములు కోల్పోయిన కుటుంబాల పునరావాసం–పునర్నిర్మాణం ( ఆర్ఎన్ఆర్) సమస్యలు, ఎన్‌టిపిసిలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఇటీవలి పైప్‌లైన్ బర్స్ ఘటన వంటి అంశాలన్నీ బలంగా ప్రస్తావించారు. పరిశ్రమల అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యం, పర్యావరణం రాజీకి గురి అవ్వడం అస్సలు సహించబోమని ఆయన స్పష్టం చేశారు.అలగే ప్రజలకు శుభ్రమైన గాలి పీల్చే హక్కు, సురక్షిత వాతావరణంలో జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులు అని ఎంపీ వంశీకృష్ణ గుర్తు చేశారు. పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా సుస్థిరమైన పద్ధతులు, కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి పరిశ్రమల అభివృద్ధి చేయకూడదు. శుభ్రమైన గాలి, సురక్షితమైన పర్యావరణం మీద ఎలాంటి రాజీ ఉండదు. భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం, స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మా మొదటి ప్రాధాన్యం అన్నారు.అలగే కేంద్రం,రాష్ట్రం, పరిశ్రమలు, నియంత్రణ సంస్థలు కలసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ ప్రజా హక్కులు ఒకే దారిలో సాగుతాయని ఎంపీ పిలుపునిచ్చారు.
పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ ముఖ్యం
- Advertisement -
- Advertisement -