నవతెలంగాణ-హైదరాబాద్ : దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ (PLB) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.1865.68 కోట్లు పీఎల్‌బీ కింద చెల్లించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
రైల్వే పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రి తెలిపారు. 78 రోజుల బోనస్ అయినా చెల్లింపులపై పరిమితి వల్ల ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.17,951 మాత్రమే లభించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేపట్టగా.. 730 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.