నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ శివారు మియాపూర్‌లోని రఫా పునరావాస కేంద్రంలో మాదకద్రవ్యాల వ్యసనంపై చికిత్స పొందుతున్న సందీప్ (39) అనే వ్యక్తి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్ గత ఎనిమిది నెలలుగా డ్రగ్ డీ-అడిక్షన్ ట్రీట్మెంట్ కోసం అదే కేంద్రంలో ఉంటున్నాడు. నల్గొండకు చెందిన ఆదిల్, బార్సాస్‌కు చెందిన సులేమాన్ అనే మరో ఇద్దరు వ్యక్తులు అదే పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతూ, సందీప్‌పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ముగ్గురూ మాదకద్రవ్యాలకు బానిసలయ్యారు. చికిత్స సమయంలో వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో బుధవారం రాత్రి ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆదిల్, సులేమాన్ కలిసి సందీప్‌పై దాడి చేయడంతో అతను మృతి చెందాడు.
ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.