Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమూడు దేశాల పర్యటనకు బయల్దేరిన కల్వకుంట్ల కవిత

మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన కల్వకుంట్ల కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్ : తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఖతార్, మాల్టా, లండన్‌లలో జరగనున్న వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఆమె ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. తొలుత హర్యానాలో జరిగే మాజీ ఉప ప్రధాని దేవిలాల్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి ఖతార్‌కు పయనం కానున్నారు. కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ఇటీవలే అనుమతి మంజూరు చేసింది.

పర్యటన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 26న ఖతార్‌లో తెలంగాణ జాగృతి స్థానిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో కవిత పాల్గొంటారు. ఆ తర్వాత సెప్టెంబర్ 27న మాల్టాలో, 28న లండన్‌లో జాగృతి శాఖలు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని ప్రవాస తెలుగువారితో కలిసి పండుగను జరుపుకుంటారు.

ఈ కార్యక్రమాల ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై ప్రచారం చేయడంతో పాటు, విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి మధ్య ఐక్యతను పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. తన పర్యటన ముగించుకుని కవిత సెప్టెంబర్ 29న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -