నవతెలంగాణ- హైదరాబాద్ : పాముతో రైలెక్కిన ఓ వ్యక్తి దానిని చూపించి భయపెడుతూ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. అహ్మదాబాద్–సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ముంగాలి, బినా జంక్షన్ల మధ్య ఓ వ్యక్తి చేతిలో పామును పట్టుకుని ఓ కోచ్‌లో తిరుగుతూ కనిపించాడు. ప్రయాణికులను సమీపించి డబ్బులు ఇవ్వాలని కోరాడు. అతడి చేతిలో పామును చూసి భయపడిన ఓ ప్రయాణికుడు తన పర్సు తీసి డబ్బులు ఇస్తున్న దృశ్యాలు 22 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దీపక్ రఘువంశీ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. “మధ్యప్రదేశ్‌లోని ముంగాలి స్టేషన్‌లో పాముతో ఉన్న వ్యక్తి రైలు ఎక్కాడు. భారతీయ రైల్వేలో కష్టపడి పనిచేసే కార్మిక వర్గం నుంచి డబ్బులు గుంజడానికి ఇదొక కొత్త మార్గం” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ ఆయన ఈ ఫిర్యాదు చేశారు.
ఈ వైరల్ వీడియో రైల్వే ప్రయాణికుల సహాయ విభాగం ‘రైల్వే సేవా’ దృష్టికి వెళ్లింది. వారు వెంటనే స్పందిస్తూ ప్రయాణ వివరాలను (పీఎన్ఆర్/యూటీఎస్ నంబర్), మొబైల్ నంబర్‌ను తమకు డీఎం (డైరెక్ట్ మెసేజ్) ద్వారా పంపించాలని కోరారు. మరోవైపు, ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశారని కొందరు విమర్శిస్తుండగా, ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.