నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో బీ.ఫార్మసీ, ఫార్మ్-డి, బయో-టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో బైపీసీ స్ట్రీమ్ అభ్యర్థుల కోసం (TG EAPCET(Bi.P.C)-2025) టీజీఈఏపీసెట్ (Bi.P.C)– 2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 5 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ దశలుగా నిర్వహించనున్నారు.
ఫైనల్ ఫేజ్ అక్టోబర్ 16 నుంచి 24 వరకు ఉంటుంది. ఇందులో కొత్తగా సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు జరుగుతాయి. ఈ విడతలో సీటు పొందిన వారు తప్పనిసరిగా అక్టోబర్ 22 నుంచి 23 మధ్య సంబంధిత కళాశాలలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
అక్టోబర్ 24న కళాశాలలు అభ్యర్థుల జాయినింగ్ వివరాలను అప్డేట్ చేయాలని అధికారులు వెల్లడించారు. స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు అక్టోబర్ 23న అధికారిక వెబ్‌సైట్ https://tgeapcetb.nic.in లో విడుదల కానున్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు అభ్యర్థులు, తల్లిదండ్రులు వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించి తాజా సమాచారం తెలుసుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ & కన్వీనర్ దేవసేన గురువారం షెడ్యూల్ విడుదల చేశారు.