– బిర్లా ప్లాంటోరియంలో రామకృష్ణకు ఈ అవార్డు ప్రధానం..
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి బాలురు ఉన్నత పాఠశాల గణిత శాస్త్ర ఉపాధ్యాయులు విజయగిరి రామకృష్ణ ప్రతిష్టాత్మక నేషనల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు 2025 కు ఎంపికయ్యారు. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలో గల భాస్కర ఆడిటోరియం లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేశారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అత్యుత్తమ బోధనలు, సృజనాత్మక ఆవిష్కరణలు, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి ఈ అవార్డు అందజేస్తుందని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమలాకర్ తెలిపారు. వీరిలో రామకృష్ణ ఉండడం కామారెడ్డి జిల్లాకు గర్వ కారణం అన్నారు.
వీరు విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కలిగేలా బోధన చేస్తూ, గణిత ఒలంపియాడ్, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం చేసి జాతీయ, రాష్ట్రస్థాయిలో ఎంపిక అవ్వడానికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారన్నారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన రామకృష్ణ మాట్లాడుతూ తన సేవ, నైపుణ్యాన్ని గుర్తించిన శారద ఎడ్యుకేషన్ సొసైటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు సెప్టెంబర్ 5 న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన మారం పవిత్ర, అర్చన చేతుల మీదుగా అందుకోవడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్య కౌన్సిలర్ పురుషోత్తం, నటులు రఘు, శ్రీనివాస్, ఐసిఐఆర్ డైరెక్టర్లులు పాల్గొన్నారు.తనను అభినందించిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.