నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ యువ క్రికెటర్ సైమ్ అయూబ్ విషయంలో ఆ జట్టు మాజీ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ కీలక సూచనలు చేశాడు. ఆసియా కప్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న అయూబ్‌కు కొంతకాలం విశ్రాంతినివ్వాలని, అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు. అయూబ్ పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు అనడంలో సందేహం లేదని, కానీ ప్రస్తుత ఫామ్‌లేమి అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ వకార్ యూనిస్ ఈ వ్యాఖ్యలు చేశాడు. “అతను ప్రతిభావంతుడు కాదని నేను అనడం లేదు. నిస్సందేహంగా అతను పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు. కానీ కొన్నిసార్లు ఫామ్ సరిగ్గా లేనప్పుడు, ఆటగాళ్లు ఒక విషవలయంలో చిక్కుకుపోతారు. మరింత కుంగిపోతారు. ఇప్పుడు అయూబ్ విషయంలో అదే జరుగుతోంది. అతడిని బెంచ్‌కే పరిమితం చేయాలని నేను గతంలోనే చెప్పాను” అని వకార్ వివరించాడు.