నవతెలంగాణ-హైదరాబాద్: నైరుతి పవనాల చురుకుదనంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు తదితర కుండపోతగా వానాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. తాజాగా కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) కేరళలో నాలుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, పతనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలల్లో శుక్రవారం 115.5 – 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, త్రిస్సూర్ పాలక్కాడ్ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
కాగా, ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధలో భారీ వర్షాలు పడనున్నాయి.