– రెడ్ స్క్వేర్‌లో విక్టరీ డే పరేడ్ ఉత్సవాలు
– కండ్లు చెదిరేలా 11వేల మందికి పైగా సైనికుల కవాతు
– 30మందికి పైగా ప్రపంచ నేతల హాజరు
– రష్యా ఫోబియాకు వ్యతిరేకంగా పోరు కొనసాగుతుందన్న పుతిన్
మాస్కో: విక్టరీ డే పరేడ్ సందర్భంగా రష్యా శుక్రవారం ఉదయం రెడ్ స్క్వేర్‌లో తన సైనిక పాటవాన్ని ప్రదర్శించింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా మాస్కోలో జరుగుతున్న ఈ విజయోత్సవాలకు దాదాపు 30మందికి పైగా ప్రపంచ నేతలు హాజరయ్యారు. హాజరైన వారిలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా, వెనిజులా నేత నికొలస్ మదురోతో సహా సెంట్రల్ ఆసియాలోని రష్యా మిత్ర దేశాల నేతలు కూడా వున్నారు. కాగా ఈ ఉత్సవాలకు వచ్చిన యురోపియన్ నేతల్లో సెర్బియా, స్లోవేకియా అధ్యక్షులు మాత్రమే వున్నారు. చివరి నిముషంలో అజర్‌బైజాన్, లావోస్ అధ్యక్షుల పర్యటనలు రద్దయ్యాయి. అమెరికా నుండి ఉన్నత స్థాయిలో అధికారులెవరూ ఈ పరేడ్‌లో పాల్గొనలేదు. ఆర్మేనియా, ఇజ్రాయిల్, మంగోలియా, అమెరికా సహా పలు దేశాలకు చెందిన రెండో ప్రపంచ యుద్ధ వీరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
పరేడ్ ప్రారంభం కాగానే రష్యా రక్షణ మంత్రి ఆండ్రె బెలూసొవ్ సైనిక బలగాను అభినందించారు. పరేడ్‌లో 11వేల మందికి పైగా సైనికులు కవాతు నిర్వహించారు. ప్రత్యేక మిలటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న మరో 1500మంది సైనికులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారు. మిత్రదేశాల సైన్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది. మాస్కోతో పాటుగా రష్యా వ్యాప్తంగా ఇతర నగరాలైన సెయింట్ పీటర్స్‌బర్గ్‌్, వ్లాదివొస్తొక్, ఉలన్-ఉద్, నొవొసిబ్‌రిస్తిక్, ఉఫా, కజన్, తదితర నగరాల్లో విక్టరీ డే ఉత్సవాలు జరిగాయి. రెడ్ స్క్వేర్‌లో సాంప్రదాయ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసే ప్రసంగంలో భాగంగా పుతిన్ ప్రసంగించారు. ”వాస్తవం, న్యాయం మన పక్షాన వున్నాయి. యావత్ దేశం-మన సమాజం, మన ప్రజలు ఈ ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌లో పాల్గొన్నవారి వెంట వున్నారు.” అని వ్యాఖ్యానించారు. ”వారి సాహసాన్ని, కృత నిశ్చయాన్ని చూసి మేం గర్వపడుతున్నాం.
ఆ స్ఫూర్తి బలమే మాకు ఎప్పుడూ విజయాన్ని అందిస్తుంది.” అని పుతిన్ పేర్కొన్నారు. నాజీవాదం, రష్యా ఫోబియా, యూదు విముఖతలకు వ్యతిరేకంగా రష్యా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఈ విధ్వంసకర ఆలోచనలను పెంపొందించే వారు పాల్పడే అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. గతంలో చేసిన ప్రసంగాల మాదిరిగా కాకుండా ఈసారి చేసిన ప్రసంగాన్ని మొత్తంగా ఉక్రెయిన్‌పై సాగుతున్న యుద్ధానికే అంకితం చేశారు. పశ్చిమ దేశాలను నేరుగా ఖండించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రెండో ప్రపంచ యుద్ధం నుండి నేర్చుకున్న గుణపాఠాలను గుర్తుంచుకుంటామన్నారు. ఆ సంఘటనలను వక్రీకరించడాన్ని ఎన్నడూ అనుమతించబోమన్నారు. పుతిన్ ప్రసంగం ముగిసిన తర్వాత, దాదాపు 200 ట్యాంకులు పరేడ్‌లో ప్రదర్శన చేశాయి. వీటిలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి టి-34 ట్యాంక్‌లు కూడా వున్నాయి. వివిధ రకాలైన సాయుధ వాహనాలు, శతఘ్ని వ్యవస్థలు, డ్రోన్‌లు, పదాతి దళ వాహనాలు అన్నీ రెడ్ స్వ్వేర్ వ్యాప్తంగా ప్రదర్శనలో ముందుకు సాగాయి. ఆ వెనుకనే యుద్ధ విమానాలు, బాంబర్లు తమ విన్యాసాలతో అనుసరించాయి.మొట్టమొదటిసారిగా, పరేడ్ మార్గానికి సమీపంలో గల రెస్టారెంట్లు, స్టోర్లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
సైనిక పాటవాన్ని ప్రదర్శించిన రష్యా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES