– ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ధాన్యం కొనట్లేదు
– బాండ్ పేపర్ రాసిచ్చిన భట్టి విక్రమార్క హామీల అమలు లేదు
– కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ఈ ఐదేండ్లు ఇబ్బందులు తప్పవు
– స్థానిక సంస్థల ఎన్నికల్లో దిమ్మతిరిగేలా షాకివ్వాలి
– డీసీఎంఎస్ మాజీ చైర్మెన్ రాయల విగ్రహావిష్కరణ సభలో
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రేవంత్ రెడ్డి లాంటి దివాళాకోరు ముఖ్యమంత్రి మరొకరు లేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. ముఖ్యమంత్రి హౌదాలో ఉండి తమను ఓ దొంగలా చూస్తున్నారని మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఏమి ఉపయోగమని, కనీసం ధాన్యం కూడా కొనుగోలు చేయలేని స్థితి ఉందని ఆరోపించారు. బాండ్ పేపర్లు రాసి ఎన్నికల్లో గెలిచిన భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ మాజీ చైర్మెన్ రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహావిగ్రహాన్ని కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆర్థికంగా లోటు ఉందని ఉన్న స్కీములను ఎత్తివేసిన ప్రభుత్వం కొత్త పథకాలు ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్టు, రైతుబంధు, రుణమాపీ, పెన్షన్ల పెంపు ఇలా ఎన్నో పథకాలు ఆగిపోయాయన్నారు. మార్పు కోసం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించినందుకు ఈ ఐదేండ్లు ఇబ్బంది పడాల్సిందేనని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించి ప్రభుత్వ వ్యతిరేకత చాటాలన్నారు. భద్రాచలంలో శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక తప్పదన్నారు. గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీనే అండ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు విని ప్రజలంతా మోసపో యారని, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం పట్టుబడుతామని స్పష్టం చేశారు.
దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తారు..?
ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్‌ను.. దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తారని కేటీఆర్ అన్నారు. గుడిలో చెప్పులు ఎత్తుకుపోయేవారిలా చూస్తున్నారనడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్ముకుంటే ఐదేండ్లు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు కడితే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ నీళ్లు నెత్తిన చల్లుకున్నారే తప్ప.. చుక్క నీరివ్వలేదన్నారు. పాలేరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భారీ మెజార్టీతో కందాళ ఉపేందర్ రెడ్డి గెలువడం ఖాయమని తెలిపారు. లింగాల కమల్ రాజ్‌ను ఓడించేందుకు భట్టి విక్రమార్క ప్రజలకు తప్పుడు హామీలిచ్చారని, బాండ్ పేపర్లు రాసి దేవుని గుడిలో పెట్టి ఎన్నికల్లో గెలిచిన భట్టి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సభలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజరుకుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ లాంటి సీఎం మరొకరు లేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES