నవతెలంగాణ – హైదరాబాద్: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. డీఎంకేకు చెందిన న్యాయవాది ఎన్. మురళీ కృష్ణన్ ఈ మేరకు తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మురళీ కృష్ణన్ ఆరోపించారు. కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం విజయ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్‌పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా గెలవాలని ఎన్డీఏ కూటమి పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో తన కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటాలని విజయ్ భావిస్తుండగా, ఈ ఫిర్యాదు ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.