నవతెలంగాణ-హైదరాబాద్: న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగంపై భారత (India) దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే.పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలను చెబుతోందంటూ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఎగుమతి చేయడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని గహ్లోత్ అన్నారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్రవాద శిబిరాలను నడపడం వంటి పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ఆమె ఎత్తిచూపారు. ఈ ద్వంద్వ వైఖరి ఇప్పుడు ప్రధాని స్థాయికి చేరిందంటూ కడిగిపారేశారు.
పేటల్ గహ్లోత్ న్యూఢిల్లీలో జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS)లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ పదేళ్లలో అనేక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. గహ్లోత్ ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అక్కడ ఆమె ప్రపంచ శాంతి, భద్రత, సహకారంపై చర్చల్లో భారత్ తరఫున తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. యూఎన్ పోస్టింగ్‌కు ముందు గహ్లోత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ యూరోపియన్ వెస్ట్ డివిజన్‌లో అండర్ సెక్రటరీగా సేవలందించారు. అంతేకాదు, పారిస్, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్స్‌లో కూడా పనిచేశారు.