నవతెలంగాణ – హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రం ‘దేవర’. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించినా, దానిపై ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ, చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా ‘దేవర 2’ పై ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
‘దేవర’ మొదటి భాగం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకుంది. “దేవర తాండవానికి ఏడాది పూర్తయింది. దేవర 2 కోసం సిద్ధంకండి” అంటూ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటనను కూడా విడుదల చేసింది.
“ప్రతి తీరాన్ని వణికిస్తూ అలజడి సృష్టించి సంవత్సరం గడిచింది. అప్పటి నుంచి ప్రపంచం గుర్తుంచుకున్న పేరు దేవర. అది భయంతో అయినా, ప్రేమతో అయినా వీధులు ఎప్పటికీ మర్చిపోవు. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర 2’ కోసం సిద్ధం అవ్వండి. అతి త్వరలో మరిన్ని అప్‌డేట్స్ మీ ముందుకు వస్తాయి” అని నిర్మాణ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.
ఈ అనూహ్య అప్‌డేట్‌తో తారక్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనాన్ని మించి సీక్వెల్ ఉండబోతోందని అంచనాలు పెంచుకుంటున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ చెప్పడంతో ‘దేవర 2’ పై అంచనాలు మరింతగా పెరిగాయి.