నవతెలంగాణ-హైదరాబాద్: డబుల్ ఇంజన్.. ట్రబుల్ ఇంజన్ అని మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో నెలల తరబడి జీతాలురాక టీచర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి అనేక సార్లు లేఖలమీద లేఖలు రాశారు. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఓ ఉపాధ్యాయుడు తన రక్తంతో ప్రధాని మోడీకి లేఖ రాశారు.
పదోన్నతులు, బదిలీలు, పాత పెన్షను పథకంతో సహా సుమారు 34 డిమాండ్లతో చంపావత్ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ సభ్యుడు రవి బాగోటి ఈ లేఖ రాశారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 500 మంది ఉపాధ్యాయులు ప్రధానికి లేఖలు రాసినట్లు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ అధ్యక్షుడు రామ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నారు.