Saturday, May 10, 2025
Homeరాష్ట్రీయంమెట్రో చార్జీల పెంపు

మెట్రో చార్జీల పెంపు

- Advertisement -

ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకం
వినతులు, విజ్ఞప్తులు వినేందుకు సిద్ధంగా లేని సంస్థ
చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి : హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం
హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డిని కలిసిన ఫోరం ప్రతినిధులు
నవతెలంగాణ- సిటీబ్యూరో

మెట్రో రైల్‌ చార్జీల పెంపు పూర్తిగా ఏకపక్షం, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం.. అన్యాయమని హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం(హెచ్‌సీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి వీరయ్య అన్నారు. మెట్రో రైల్‌ చార్జీలను పెంచే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హెచ్‌సీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డిని కలిసి చర్చించారు. మెట్రో చార్జీల పెంపుదల వ్యవహారంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కుగానీ, ప్రభుత్వానికిగానీ ఎలాంటి సంబంధమూ లేదని, ఇది పూర్తిగా ఎల్‌అండ్‌టీ సంస్థకు సంబంధించిన అంశమని ఎన్వీఎస్‌ రెడ్డి తెలియజేశారు.
అనంతరం హెచ్‌సీఎఫ్‌ ప్రతినిధి బృందం ఉప్పల్‌లోని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ సంస్థ కార్యాలయంలో మేనేజింగ్‌ డైరెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. మిగతా అధికారులు ఎవరూ వినతిపత్రం తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఎల్‌అండ్‌టీ ఆఫీస్‌లో అందజేశారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిలో ఒప్పందం చేసుకుని, చార్జీల పెంపకంలో తమకు ఎలాంటి సంబంధమూ లేదని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చెప్పడాన్ని హెచ్‌సీఎఫ్‌ ఖండిస్తున్నదన్నారు. ప్రజల నుంచి, ప్రజాసంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ఎల్‌అండ్‌టీ సంస్థ కనీసం వినేందుకు సిద్ధపడకపోవడం దారుణమన్నారు. వెంటనే మెట్రో చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఏకపక్షంగా మెట్రో చార్జీలు పెంచితే ప్రతిఘటించాలని ప్రజానీకాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎఫ్‌ అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మల్లం రమేష్‌, పి.శ్రీనివాసరావు, రమేష్‌, సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -