Sunday, September 28, 2025
E-PAPER
Homeఆటలువెస్టిండీస్‌ జట్టుకు ఊహించని షాక్..

వెస్టిండీస్‌ జట్టుకు ఊహించని షాక్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో పసికూన నేపాల్ పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌ జట్టుకు ఊహించని షాకిచ్చింది. శనివారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పూర్తిస్థాయి సభ్యదేశంపై టీ20 ఫార్మాట్‌లో నేపాల్‌కు ఇదే మొట్టమొదటి గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేపాల్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ జట్టు ఆదిలోనే కుశాల్ భుర్తెల్ (5), ఆసిఫ్ షేక్ (3) వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35 బంతుల్లో 38), కుశాల్ మల్లా (21 బంతుల్లో 30), గుల్సన్ ఝా (16 బంతుల్లో 22) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, నవీన్ బిదైసీ 3 వికెట్లు తీశాడు.

అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్, నేపాల్ బౌలర్ల ధాటికి తడబడింది. ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొనితెచ్చుకుంది. ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు. నవీన్ బిదైసీ (22), అమీర్ జంగూ (19) మాత్రమే కాస్త ఫరవాలేదనిపించారు. చివర్లో ఫాబియన్ అలెన్ (19), కెప్టెన్ అకీల్ హొసేన్ (18) కాస్త పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తెల్ రెండు వికెట్లతో రాణించాడు. రెండో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 29న జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -