నవతెలంగాణ – హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. సినిమా ట్రైలర్‌ను రేపు (సెప్టెంబర్ 29న) విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రకటనతో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
దర్శకుడు మారుతి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్‌పైనే నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా విడుదల తేదీని ప్రకటించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.