నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. మిషిగాన్ రాష్ట్రంలోని ఓ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.
గ్రాండ్ బ్లాంక్ పట్టణంలోని ‘చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్’లో ఆదివారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా, 40 ఏళ్ల వ్యక్తి కారుతో నేరుగా చర్చిలోకి దూసుకొచ్చాడు. అనంతరం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడని గ్రాండ్ బ్లాంక్ టౌన్‌షిప్ పోలీస్ చీఫ్ విలియం రెన్యే మీడియాకు వెల్లడించారు. ఈ దాడి తర్వాత నిందితుడు ఉద్దేశపూర్వకంగానే చర్చికి నిప్పుపెట్టినట్లు తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితుడు వారిపై కూడా కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే మరణించాడని చీఫ్ రెన్యే ధ్రువీకరించారు. కాల్పుల అనంతరం చర్చిలో చెలరేగిన భారీ మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ భయానక ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ స్పందిస్తూ, “గ్రాండ్ బ్లాంక్ సమాజం కోసం నా హృదయం ద్రవిస్తోంది. ప్రార్థనా స్థలంలో హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించలేం” అని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.