నవతెలంగాణ-హైదరాబాద్: బాబా చైతన్యానంద సరస్వతికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్ రవి ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తమను లైగింకంగా వేధిస్తున్నాడని సుమారు 16 మంది విద్యార్థులు బాబా చైతన్యానంద సరస్వతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, బాబా కోసం తీవ్రంగా పోలీసులు గాలించారు. ఎట్టకేలకు ఆదివారం(సెప్టెంబర్ 28) ఆగ్రాలోని ఓ హోటల్‌లో బస చేసిన అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 50 రోజుల్లో 15 హోటళ్లను మార్చాడు. సీసీటీవీ కెమెరాలు లేని చౌక హోటళ్లలోనే అతను బస చేసేవాడని పోలీసులు తెలిపారు. బాబాకు సహకరించిన ఆయన సహాయకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాబా చైతన్యానంద సరస్వతి నుంచి పోలీసులు ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్‌లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్ చేసే సౌకర్యం ఉండటం పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని తెలిపారు.