నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించినా, ట్రోఫీని అందుకోలేకపోయిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ గొడవకు తెరదించేందుకు బదులుగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మరో కొత్త మెలిక పెట్టారు. విజేతగా నిలిచిన భారత జట్టుకు మెడల్స్ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే దానికోసం ఒక ‘అధికారిక కార్యక్రమం’ (ఫార్మల్ ఫంక్షన్) ఏర్పాటు చేయాలని ఆయన షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ఆసియా కప్ నిర్వాహకులకు తెలిపారని, కానీ అలాంటి కార్యక్రమం జరిగే అవకాశాలు చాలా తక్కువని సమాచారం.
ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం బహుమతుల ప్రదానోత్సవంలో ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఈ విషయంలో భారత జట్టుకు బీసీసీఐ పూర్తి మద్దతు ప్రకటించింది.