నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దలు తన ప్రేమకు అభ్యంతరం చెప్పారని కలత చెందిన యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆ యువకుడి ప్రియురాలు కూడా అదే చోట బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని మేడికొండూరు మండలంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోటె గోపీకృష్ణ(20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక(20) ఎన్‌ఆర్‌ఐఐటీ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.
ఇద్దరూ వేర్వేరు హాస్టళ్లలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఒప్పుకోరేమోనని అనుమానించి పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 5న గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌ను కు వెళ్లి రక్షణ కోరారు. తామిద్దరం పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు. దీంతో ఇరువురి కుటుంబాలను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. ఆ కుటుంబాలకు, ప్రేమ జంటకు కౌన్సెలింగ్ చేశారు. అయినా పెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన గోపీకృష్ణ, లక్ష్మీ ప్రియాంక తాము సొంతంగానే బతుకుతామని వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే ఈ నెల 27న సాయంత్రం గుంటూరు నుంచి మార్కాపురం వైపు వెళ్లే ఓ రైలుకు ఎదురెళ్లి గోపికృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి లక్ష్మీ ప్రియాంక మరుసటి రోజు అదే ప్రాంతంలో రైలు కింద పడి మృతి చెందింది. రైల్వే పోలీసులు మృతదేహాలను నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రి తరలించారు.