నవతెలంగాణ-హైదరాబాద్ : సెంట్రల్ ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. సెబు ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విలయానికి ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఫిలిప్పీన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మోలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి 9:59 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. తొలుత భూకంప తీవ్రత 6.7గా ప్రకటించినప్పటికీ, తర్వాత దానిని 6.9గా సవరించారు. బోగో నగరానికి ఈశాన్యంగా 19 కిలోమీటర్ల దూరంలో, కేవలం 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూమి ఉపరితలానికి అతి సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.
ఈ భూకంపం వల్ల బోగో నగరంలోనే 13 మంది మరణించగా, సమీపంలోని శాన్ రెమిగియో పట్టణంలో నలుగురు, మెడెలిన్ మున్సిపాలిటీలో ఒకరు మృతిచెందినట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. క్షతగాత్రులతో బోగో నగరంలోని ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
ఈ భూప్రకంపనల ధాటికి పలుచోట్ల వంతెనలు, గ్రామీణ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ లైన్లు తెగిపడటంతో సెబుతో పాటు సమీప దీవుల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే, నేషనల్ గ్రిడ్ కార్పొరేషన్ వెంటనే మరమ్మతులు చేపట్టి అర్ధరాత్రి తర్వాత చాలా ప్రాంతాలకు విద్యుత్‌ను పునరుద్ధరించింది.